Thursday, October 11, 2007

బాల్యం!

పాలబుగ్గల పసి పిల్లల్లారా...
బుడి బుడి నడకల బుడుగుల్లారా...
చీకు చింత లేదు, చిందులేసే మీరు
అరమరికలసలే లేవు, అర్థం కాని ఆంతర్యములే మీరు
ఉత్సుకతకు అంతేలేదు, ఉరకలేసే చైతన్యములే మీరు
అగుపించినవన్నీ అంతు చూద్దామనుకుంటారు
అందకుండా చేసినంతనే అయోమయంతో 'క్యేర్ క్యేఋమంటారు

మాయ మంత్రములు తెలియవు
కాని, మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తారు
మీ బోసినవ్వులకు భాషలేదు
కాని, మామనసులతో బహు బాసలు చేస్తారు
తడబడు మీ తప్పటడుగులకు తాళం లేదు
కాని, తన్మయంతో మాకు కాలమే తెలియదు

చిన్ని చిన్ని కన్నుల్లోన చిందే కాంతుల
తరించే మామనస్సులకు
నవ మాసములేపాటివిరా... అని
మురిసిపోతూ తల్లి తినిపించే...
గోరుముద్దల ముద్ద,ముద్దకూ...
ముద్దులొలుకుతూ మారాం చేస్తారు...

ఒక్క దుముకున, ఒడిని దూకి
బుల్లి బుల్లి చేతులను మెడలో దండగ వేసి,
వచ్చీ రాని మాటల గారడితో...
మనస్సులను బందీ చేసి,
అలసి సొలసి ఇంటిని చేరిన
తండ్రి మనస్సుల తేనెల జల్లు కురిపిస్తారు

ఆ దేవుడే గనుక నాకు ఒక వరమిస్తే...
నేనేమి కోరను ?!
నా తనువును కుదించి, మనస్సును ముకుళించి,
నా బాల్యమునే తిరిగివ్వమని కోరనా...!?!
అతను సైతము దుష్ట శిక్షణ, శిష్ట రక్షనకై...
పరిపూర్ణుడిగా ఈ భువికి రాగలిగీ...
కోరి బాల్యము ధరించే...
తన చిలిపి అల్లరుల,
ఎందరో యశోదమ్మలను అలరించే...
ఈ జగతిని మైమరపించే...
కానీ, పసితనమున పరిణితికి పనియేల...
పరిణితిలేక నాకు పసితనం అనుభవమయ్యేదెలా...
ఎలా...నా ఈ కోరిక తీరేదెలా...?

మీ కేరింతల ఏ వింతలు దాగున్నవో...
మీ తౄళ్ళింతల నాకేల ఈ చింత చిగురించినదో...
"నా బాల్యము నా కనుల కదలాడితే...!?!"
నా ఈ ఆశే గనుక నెరవేరితే...?!
ఎంత నా మనస్సు పులకించేనో...?!

No comments: